వేదాంతమంటే పది ఉపనిషత్తులు. ఇవి వేదాలకు శిరస్సువలె ఉన్నాయి కావున వీటిని శ్రుతిశిరములు అన్నారు. వేదాల సారాన్నే ఇవి ఉపదేశిస్తున్నాయి. ఈ జగత్తుయొక్క మరియు మన జీవితముయొక్క పరమార్థాన్ని వివరించటమే వీటి ఉద్దేశం. ఎలాంటి కల్పనకు అవకాశం లేకుండా మనందరికీ సిద్ధంగా ఉన్న నిర్వికారంగా ఉన్న అనుభవాన్నే ప్రమాణంగా వేదాంతం ఈ పరమార్థాన్ని వివరిస్తున్నది.
భారతీయ సనాతన ధర్మమని జనులలో ప్రచారంలో ఉన్నదే వేరు, వేదాంతం ఉపదేశిస్తున్న సత్యమే వేరు. ఈ సత్యాన్ని గుర్తించ గలిగితే ఇక తెలుసుకోవలసినది కానీ చేయాల్సినది కానీ ఏమీ మిగలక పరమపురుషార్థమే ప్రాప్తిస్తుంది. వేదాంతం ఉపదేశిస్తున్న ఈ పరమసత్యమే సనాతన ధర్మం. దీనిని శ్రీ ఆది శంకరా చార్యులవారు తమ సంప్రదాయాన్ని అనుసరించి ప్రస్థానత్రయ భాష్య రూపంగా అనుగ్రహిస్తే తర్వాత కొన్ని శతాబ్దాలు పండితుల తర్కం వల్ల మరలా కలుషితం కాగా ఇపుడు అపరశంకరులు శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామివారు తమ జ్ఞానమయతపస్సుతో మరలా సత్యమే కావాలనే జిజ్ఞాసువుల కోసం ఈ పరిశుద్ధ వేదాంత సాహిత్యాన్ని కర్ణాటక హాసన్ జిల్లా హోళే నర్సిపురంలో స్థాపించిన అధ్యాత్మ ప్రకాశ కార్యాలయం తరుపున ఇంగ్లీష్, సంస్కృతం మరియు కన్నడ భాషలలొ అనుగ్రహించారు.
ఈ సాహిత్యాన్ని తెలుగు వారికి అందించాలనే ఏకైక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా రాయదుర్గంలో శ్రీ స్వామి వారి కార్యాలయానికి అనుబంధ సంస్థ గా 1964 లో ఆధ్యాత్మ ప్రచార సేవశ్రమాన్ని స్థాపించిన, శ్రీ స్వామివారి సాక్షాత్ శిష్యులైన వే||బ్ర||శ్రీ పారాయణం లక్ష్మీకాంతశర్మ గారి గ్రంథములే ఈ వెబ్సైట్ కు వనరు. ఇక్కడ శ్రీస్వామి వారి మరియు శ్రీ శర్మ గారి సమగ్ర సాహిత్యమంత ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న మన తెలుగు తెలిసిన వారికి అందిస్తూ సాగటమే ఈ వెబ్సైట్ యొక్క ఉద్దేశం.
సత్యమే కావాలనే జిజ్ఞాసువులు ఈ పుస్తకాలను, వ్యాసాలను స్వయం అధ్యయనం చేయవచ్చు. అధ్యయనం లో తమకు ఎలాంటి ప్రశ్నలున్నా కామెంట్స్ రూపంలో ఇక్కడ తెలుపగలిగితే ఆ ప్రశ్నలకు సరైన సమాధానములను ఇవ్వడానికి ప్రయత్నిస్తాము.
ఆశ్రమంలో జరిగే వేదాంత సత్సంగాల్లో చెప్పుకునే భజనలను నామ సంకీర్తనలను ఇక్కడ ఇస్తున్నాము. అలాగే వేదాంత గ్రంథాల మీద మహాత్ములు తీసుకున్న పాఠముల వీడియొలను కూడా ప్రచురించదలచినాము.
సత్య జిజ్ఞాసువులకు అవసరమైన మొత్తం సామగ్రిని ఇక్కడ పొందుపరచాలన్నదే మా ధ్యేయం!
Today’s Sandesham
Specials
News Updates